గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న తన కార్యాలయంలో ఆయన ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలకు ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ కల్పించడం సంతోషకరమని అన్నారు. 2020-21 సంవత్సరానికి గాను జీహెచ్ఎంసీలో రూ.15వేల వరకు ఆస్తి పన్ను కట్టేవారికి, ఇతర పట్టణాల్లో రూ.10వేల ఆస్తి పన్ను కట్టేవారికి అందులో 50 శాతం రాయితీని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ నిర్ణయంతో ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని, అనేక మంది సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు.

అలాగే వరద సహాయం అందని వారు మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే సహాయం అందేలా మరొక అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,500 నుంచి జీతాన్ని రూ.17,500కు పెంచడం హర్షణీయమని, దీంతో కార్మికుల ముఖాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని అన్నారు. ప్రజల పక్షాన నిలబడిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కార్పొరేటర్ సాయిబాబా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ రాగం జంగయ్య యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ శంకర్ రాజు ముదిరాజ్, నాయకులు సతీష్ ముదిరాజ్, రమేష్ గౌడ్, జగదీష్, వెంకటేష్ ముదిరాజ్, నారాయణ, బాలు, గోపన్‌పల్లి యూత్ రమేష్, ఫిరోజ్ శ్రీకాంత్, సుమన్ పాల్గొన్నారు.