నమస్తే శేరిలింగంపల్లి: అసంపూర్తిగా ఉన్న చెరువుల అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అధికారులకు సూచించారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని తన క్యాంపు కార్యాలయంలో గంగారాం పెద్ద చెరువు, మియాపూర్ పటేల్ చెరువు సుందరీకరణ పనుల పురోగతిపై ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో బుదవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ద్వారా రూ.31.26 కోట్లతో పటేల్ చెరువు, గంగారాం పెద్ద చెరువు సుందరీకరణ పనులు చేపట్టడం జరిగుతుందని తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని సూచించారు. సుందరీకరణ పనుల్లో జాప్యానికి గల కారణాలను గుర్తెరికి, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇరిగేషన్ ఏఈఈ శేషగిరి రావు, చందానగర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, టీపీఎస్ తుల్జా సింగ్, మధు తదితరులు పాల్గొన్నారు.
