నమస్తే శేరిలింగంపల్లి: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే… ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అక్రమార్కులు… కోవిడ్ విజృంభనతో ప్రజలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతుంటే కబ్జాకోరులు మాత్రం సర్కారు భూములు కాజేసేందుకు స్కెచ్‌లు వేస్తున్నారు. చందానగర్ జవహార్‌కాలనీ రోడ్ నెంబర్ 6లోని సర్వేనెంబర్ 174లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొందరు ఇటీవల రెండు నిర్మాణాలు ప్రారంభించారు. దీంతో శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఒక నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి గత నెల 23న సదరు స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటు బోర్డులు పాతారు. కాగా వారం క్రితం లాక్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో అక్రమార్కులు సదరు భూమిపై తిరిగి కన్నేశారు. సర్కారు స్థలాన్ని కాజేసేందుకు ఇంతకు మించిన సమయం దొరకదని సరికొత్త స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది పాతిన బోర్డులను రాత్రికి రాత్రే తొలగించారు. కాగా ప్రభుత్వ భూమి కబ్జా ప్రయత్నాలపై స్థానికులు మండి పడుతున్నారు. రెవెన్యూ అధికారులు ఆలస్యం చెయ్యకుండా భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్కార్ భూములపై కన్నేస్తే కఠిన చర్యలు తప్పవు: తహసిల్దార్ వంశీమోహన్
డిప్యూటీ కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్ధార్ వంశీమోహన్‌ను “నమస్తే శేరిలింగంపల్లి” వివరణ కోరగా చందానగర్ సర్వేనెంబర్ 174లో తాజా ఘటన తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ సూచిక బోర్డుల తొలగింపు చట్టరిత్యా నేరమని అన్నారు. భాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. లాక్‌డౌన్‌లో సర్కారు భూములను సులువుగా కబ్జా చెయ్యొచ్చనే భ్రమలోంచి అక్రమార్కులు బయటకు రావాలని, ప్రభుత్వ స్థలాలపై తమ సిబ్బంది నిఘా ఎల్లప్పుడు కొనసాగుతు ఉంటుందని అన్నారు. సర్కారు భూములపై కన్నేస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
[…] లాక్‌డౌన్‌లో ప్రభుత్వ భూమి కబ్జాకు స… […]