నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్ సుధాంష్ నందగిరి ఆద్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఇన్‌స్టీట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసన్ నారాయణ గూడ వైద్యాధికారి భరణీ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి, కుకట్‌పల్లి సర్కిళ్లకు సంబంధించిన సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సుధాంష్, డాక్టర్ భరణీలు మాట్లాడుతూ కరోనా విజృంభన నేపథ్యంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు పడిపోతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర రోగులకు ఉపయోగపడే రీతిలో జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా రక్తాన్ని సేకరించడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. సేకరించిన రక్తాన్ని ప్రాధాన్యతా క్రమంలో క్యాన్సర్ పీడిత పిల్లలకు, గర్భిణిలకు, న్యుమోనియా సోకిన వారికి, తలసీమియా వ్యాధి గ్రస్తులకు అందించడం జరుగుతుందని అన్నారు. రక్తదానం చేసిన సిబ్బందిని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కుకట్‌పల్లి ఉపకమిషనర్ ప్రశాంతి, వైద్యాధికారులు డాక్టర్ కార్తీక్, చంద్రశేఖర్‌రెడ్డి, పారిశుధ్య అధికారి శ్రీనివాస్, ఎస్ఆర్‌పీ, ఎస్ఎఫ్ఏలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
