నమస్తే శేరిలింగంపల్లి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూపొందించిన నవతెలంగాణ 2022 సంవత్సరం క్యాలెండర్ ను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్షపతి యాదవ్ ఆవిష్కరించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి లోని ఆయన నివాసంలో మియపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యులతో కలిసి క్యాలెండర్ ను విడుదల చేశారు. నూతన సంవత్సరంలో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, నేటి పోటీ ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని బిక్షపతి యాదవ్ ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని, అందులో నవతెలంగాణ పాత్ర ప్రత్యేకమైనదని అన్నారు. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరి నర్సింలు ముదిరాజ్, ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్ష్మన్ ముదిరాజ్, జాజేరవు శ్రీను, జాజేరవు రాము, సోను కుమార్ యాదవ్, శివ, నరేష్ చారి, రమేష్, పాపయ్యలు పాల్గొన్నారు.