- ఊగిసలాటలో చెన్నమనేని రమేష్ పౌరసత్వం ?
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నాగార్జున సాగర్ నియోజకవర్గం తెరాస ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. అందులో భాగంగానే పార్టీలు ఆ ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతున్నాయి. అయితే వేములవాడ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం ఊగిసలాటలో ఉండడమే కారణం.

గతంలో చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. అయితే ఆ విషయంపై చెన్నమనేని రమేష్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కాగా ఆ విషయమై హైకోర్టు ఈ నెల 16వ తేదీన తీర్పు ఇవ్వనుంది. దీంతో రమేష్ పౌరసత్వం రద్దు అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్‌తోపాటు వేములవాడ ఉప ఎన్నికకు కూడా సిద్ధంగా ఉండాలని అటు బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు ఇచ్చింది. దీంతో రెండు అసెంబ్లీ స్థానాలకు వచ్చే 6 నెలల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉన్నారు. లాక్‌డౌన్ ముందు జర్మనీ వెళ్లిన ఆయన అక్కడే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ తప్పుడు పౌరసత్వం పత్రాలను చూపించారనే ఆరోపణలతో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో అప్పట్లో హోం శాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. కాగా దానిపై చెన్నమనేని రమేష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కోర్టు ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.