నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించమని అడిగిన ప్రజలు, నాయకులు, బిచ్చగాళ్లు అయితే ఎన్నికల సమయంలో ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసం ప్రాదేయపడి గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరించలేని వారిని ఏమనాలో అర్థం కావడం లేదని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రశ్నించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష కాలనీ నుండి ఫ్రెండ్స్ కాలనీ వరకు గుంతల మయమైన రోడ్డును చందానగర్ బిజెపి నాయకులు, కాలనీ వాసులతో కలిసి చందానగర్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీ వాసులు, నాయకులు కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరితే వారిని కొత్త బిచ్చగాళ్ళు అంటున్నారని, పాత బిచ్చగాళ్ళుగా ఒక్కసారి వచ్చి ఈ రోడ్డు దుస్థితిని చూసి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
గత 6 నెలలుగా ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే ఉందని, కాలనీ వాసులు రోడ్డు సమస్య పరిష్కరించాలని మొర పెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యాడని వాపోయారు. రోడ్లు వేసేందుకు సిమెంట్, స్టీల్ రేట్లు పెరిగాయని, వర్షాలు పడుతున్నాయని ప్రజాప్రతినిధులు సమర్థించుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ రోడ్డు మీదుగా సురక్ష కాలనీ, విద్యానగర్ కాలనీ, శుభోదయ కాలనీ, సత్య ఎన్ క్లేవ్, డిఫెన్సె కాలనీ, సురక్ష హిల్స్, అర్జున్ రెడ్డి కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, శిల్ప ఎన్ క్లేవ్ కాలనీలతో పాటు 30కి పైగా అపార్ట్మెంట్ల ప్రజలు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని, ప్రతి రోజు వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం క్యాంప్ ఆఫీస్ లో పిర్యాదు చేయమంటున్నారని, క్యాంప్ ఆఫీస్ కు ఎప్పుడు వస్తారో? తెలియక ప్రజలు సమయం వృధా చేసుకుంటున్నారని వాపోయారు. వంద సమస్యలను ఒక్క రోజులో పరిష్కరిస్తామని చెప్పడం కాదు ఇచ్చిన హామీలు, సమస్యలను వంద తెలియజేస్తాం ఒక్క రోజు కాదు 520 రోజులు సమయం ఇస్తాం పరిష్కరిస్తారా అని బొబ్బ నవత రెడ్డి సూటిగా ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బిజెపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, స్టేట్ మైనారిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సైఫ్ఫుల్లఖాన్, పోచయ్య,గౌస్ తదితరులు పాల్గొన్నారు.