నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 17 ప్రకారం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 243 -S ప్రకారం జీహెచ్ఎంసీలో వార్డు కమిటీలను నియమించేలా తెలంగాణ ప్రభుత్యాన్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ కు చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ లో గవర్నర్ కలిసి వినతిపత్రం అందజేశారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం, మున్సిపల్ చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల హక్కులను, నియమ, నిబంధనలను నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థల వార్డు కమిటీల ద్వారా ఖర్చు పెట్టాల్సిన అభివృద్ధి నిధులను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి తమ ఇష్టారాజ్యంగా వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. చట్ట ప్రకారం ప్రజలకు అందవలసిన మౌళిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్యం అసెంబ్లీలో తాము చేసిన చట్టాన్ని తామే అమలు చేయకుండా, వార్డు కమిటీలను నియమించకుండా ప్రభుత్యం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వెంటనే వార్డు కమిటీలను నియమించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో చందానగర్ డివిజన్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ శోభ, మాజీ వార్డు మెంబర్ రమణ కుమారి, రాధిక తదితరులు ఉన్నారు.
