మాదాపూర్ లో రౌడీ షీటర్ల కాల్పుల కలకలం – ఒకరు మృతి, మరొకరికి గాయాలు – భూ వివాదాలే కారణమా..?

నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ నగరం హై సెక్యూరిటీ జోన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు స్నేహితుల మధ్య భూవివాద సమస్య తలెత్తడంతో స్నేహితునిపై ఒక్క సారిగా కాల్పులు జరిపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడు. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ నీరూస్ సిగ్నల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో ఇస్మాయిల్ అనే వ్యక్తిని ముజాహీద్ అనే వ్యక్తి కాల్చి చంపినట్లు తెలిసింది. కాల్పుల్లో మరొకరికి గాయాలయ్యాయి. బైక్ పై మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే ముజాహీద్, ఇస్మాయిల్ కు మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముజాహీద్ ఇస్మాయిల్ పై ఆరు రౌండ్ లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే మరణించాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముజీబ్, ఇస్మాయిల్ మధ్య ఆస్తి గొడవలే కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది. ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రున్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి గొడవల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నగరానికి చెందిన ఇస్మాయిల్, మజీబ్ లు ఇద్దరు రౌడీషీటర్లని, వీరిద్దరికి జైలులో ఏర్పడిన పరిచయంతో స్నేహితులయ్యారు. ఇరువురు సెటిల్మెంట్ ల కోసం ముఠాగా ఏర్పడినట్లు సమాచారం. డబ్బు పంపకాల్లో ఏర్పడ్డ విబేధాల వల్ల వీరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.

కాల్పుల్లో మృతిచెందిన ఇస్మాయిల్

స్థల విషయంలోనే కాల్పులు జరిగాయి
– బాలానగర్ డీసీపీ సందీప్ రావు
మాదాపూర్ కాల్పుల ఘటనకు సంబంధించి బాలానగర్ డీసీపీ సందీప్ రావు వివరాలను వెల్లడించారు. జహంగీర్, ముజాహిద్ అలియాస్ ముజ్జు, ఇస్మాయిల్ స్నేహితులని, ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇస్మాయిల్, ముజాహిద్ ఇద్దరు కలిసి సిటీలోని పలు ప్రాంతాల్లో తిరిగారని తెలిపారు. అనంతరం మాదాపూర్ నీరూస్ వద్దకు చేరుకోగానే మరో వ్యక్తితో కలిసి ఇస్మాయిల్ పై కాల్పులు జరిపారని దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇస్మాయిల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందినట్లు వెల్లడించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన జహంగీర్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ స్థలం విషయంలో వీరి గత కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయని, ఇదే విషయం మాట్లాడుతున్న క్రమంలోనే ముజీబ్ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, నిందితులను పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ తెలిపారు.

కాల్పులు జరిగిన స్థలంలో వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం

ల్యాండ్ సెటిల్మెంట్ కోసమని పిలిచి కాల్పులు జరిపారు
– కాల్పుల్లో గాయపడిన జహంగీర్
ఇస్మాయిల్, అక్రం, గౌస్, తాను నలుగురం నిరూస్ సర్కిల్ వద్ద ఉన్న టిఫిన్ సెంటర్ వద్ద కలిశాం. నాతో పాటు ముజాహిద్ కూడా అక్కడకు వచ్చాడు. ల్యాండ్ సెటిల్మెంట్ లో రూ. 20 లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉండగా ఇస్తామని చెప్పి పిలిచారు. ఇస్మాయిల్ కు ముజాహిద్ కు మాటా మాటా పెరిగి గొడవైంది. జిలాని వెంట తెచ్చుకున్న పిస్తోల్ తో ఇస్మాయిల్ పై కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ పై ఐదారు రౌండ్ల కాల్పులు జరిపడంతో ఇస్మాయిల్ తల వెనుక భాగంలో రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. దీనితో అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందాడని, అడ్డుకోవడానికి ప్రయత్నించిన తనపై కాల్పులు జరిపినట్లు జహంగీర్ తెలిపారు.

కాల్పుల్లో గాయపడిన జహంగీర్

భూ వివాదమే‌ కాల్పులకు కారణమా..?

ఈ వివాదానికి తాడ్‌ బంద్ లోని 250 గజాల భూమి కారణమని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మహ్మద్ ముజీబ్ పేరుపై ఇస్మాయిల్ గిఫ్ట్ డీడ్ చేశారని, వివాదం పరిష్కారానికి ఇస్మాయిల్ ను ముజీబ్ మాదాపూర్ కు పిలిపించగా చిన్నపాటి ఘర్షణ జరగగా ఒక్కసారి ముజీబ్ కాల్పులు జరిపాడని తెలుస్తోంది. ఇస్మాయిల్ ను దగ్గర నుంచి కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న జహంగీర్ అడ్డుకునే ప్రయత్నించగా అతనికి గాయాలయ్యాయి.

కాల్పులు జరిగిన సంఘటనా స్థలం
ఇస్మాయిల్ (పైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here