నమస్తే శేరిలింగంపల్లి: గుంతలమయమైన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరని చందానగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు బొబ్బ నవత రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పద్మజ కాలనీలో కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు చందానగర్ బీజేపీ నాయకులు, కాలనీ వాసులతో కలిసి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వందలాది రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం తాత్కాలికంగా గుంతలు పూడ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పూనుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వారం రోజులుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుంతలు పడ్డ రోడ్లను కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నా మాయమాటలతో మభ్యపెడుతున్నారే తప్ప సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతుందన్నారు. పద్మజ కాలనీ నుండి వేమన వీకేర్ సెక్షన్ రోడ్డు పూర్తిగా గుంతలమయమై దారుణంగా మారిందని వాపోయారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు రాంరెడ్డి, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, మైనారిటీ నాయకులు షైఫుల్లహ ఖాన్, ఎండీ.గౌస్, లలిత, పోచయ్య, పద్మజ కాలనీ వాసులు సీతా రాంరెడ్డి, రవికాంత్ రెడ్డి,వెంకటేష్, నర్సింహ,వినోద్, కామేష్ తదితరులు పాల్గొన్నారు.
