నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న పురాతన భవనాలను గుర్తించి అందులో నివసిస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వరద నీరు చేరడంతో స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. పోగులు ఆగయ్య నగర్ లో వర్షం దాటికి దెబ్బతిన్న ఇంటిని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించి కుటుంబానికి కాలనీలో మరో చోట పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలు వరద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టిందన్నారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఏసీపీ సంపత్, డీఈ స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.