– రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండించిన కసిరెడ్డి భాస్కరరెడ్డి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం అవ్వాలంటు శ్రేణులకు పిలుపునివ్వడంతో ఆదివారం అర్ధరాత్రి నుంచే బిజెపి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. బిజెపి రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కర రెడ్డిని చందానగర్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రాగిరి సాయిరాం గౌడ్, బిజేపి సీనియర్ నాయకుడు రాజశేఖర్ లను మియాపూర్ పోలీసులు అర్ధరాత్రే అరెస్ట్ చేశారు. వివేకానందనగర్ డివిజన్ బిజెపి నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులను కుకట్ పల్లి పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాశవిక నిర్ణయాలను ఖండిస్తున్నామన్నారు. వారి చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, గృహ నిర్బంధాలు, అరెస్టులు బిజెపి కార్యకర్తలను భయపెట్టలేవని, అధికార పార్టీ తమ గోతిని తామే తోడుకుంటుందని అన్నారు. అనవసర ఆరోపణలు చేసి అనుమానాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలను ఫణంగా పెడుతూ, బిజెపి క్యాడర్ను రెచ్చగొట్టడం మానుకోవాలని అధికార తెరాస పార్టీకి హితవు పలికారు. 2023లో ప్రజల తీర్పుతో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.