- చందానగర్‌లోని పీఆర్‌కే హాస్పిటల్ నిర్వాకం
- ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన
- స్థానిక నాయకుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన యువకుడు చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఆసుపత్రి బిల్లులు చెల్లించే వరకూ మృతదేహాన్ని అప్పగించమని చెప్పడంతో మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పటన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన ఊరెడి ఆంజనేయులు, లలితల కుమారుడు రాకేష్ కుమార్ ఈ నెల 22వ తేదీన తన ద్విచక్రవాహనం పై వస్తూ ఇస్నాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో రాకేష్ కుమార్ కు తీవ్ర గాయాలు అవ్వడంతో కొందరు వ్యక్తులు స్థానికంగా గల ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం చందానగర్ లోని పిఆర్‌కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.
కాగా 11 రోజుల పాటు జరిగిన వైద్య ఖర్చుల నిమిత్తం అప్పటికే 8 లక్షల రూపాయలు కుటుంబ సభ్యులు చెల్లించారు. అయితే చికిత్స పొందుతూ రాకేష్ కుమార్ మృతి చెందాడని, 4 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని, లేని పక్షంలో మృతదేహం అప్పగించేది లేదని ఆసుపత్రి యాజమాన్యం తెలపడంతో రాకేష్ కుమార్ బంధువులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించకపోవడంతో మృతుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టులు సృష్టించారని, చికిత్స సమయంలో సైతం కేవలం వీడియో ద్వారానే చూసేందుకు వీలు కల్పించారని బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి పఠాన్ చేరు ప్రాంతానికి చెందిన నాయకులు జోక్యం చేసుకోగా బకాయి ఉన్న బిల్లులలో మూడు లక్షల రూపాయలు చెల్లించడం తో ఆసుపత్రి యాజమాన్యం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. దీంతో మృతుడి బంధువులతో ఆందోళన విరమించారు.