నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్ షిప్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉరేళ్ల మహేష్ యాదవ్, కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు పటాన్ చెరు నియోజకవర్గం లో విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు రూ. 35 వేల కోట్లు వెంటనే చెల్లించాలన్నారు. కాలేజీ విద్యార్థులకు సంవత్సరానికి 20 వేల స్కాలర్ షిప్ మంజూరు చేయాలని, బీసీ కాలేజీ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు తశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.