నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ ను గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయి బాబ తో కలిసి ఎమ్మెల్యే గాంధీ కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ బసవతారకనగర్ లో ఇటీవల ఇళ్లు కోల్పోయిన బాధితులకు సరైన న్యాయం చేసి వారి జీవితాలలో వెలుగులు నింపాలన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గృహ నిర్మాణ పథకాలలో వెంటనే లబ్ది చేకూర్చేలా చూడాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ను కోరారు. అప్పటి వరకు తాత్కాలికంగా సదుపాయాలు కల్పించి సరైన న్యాయం చేయాలన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అమోయ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ బసవతారక నగర్ వాసులకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు.