నమస్తే శేరిలింగంపల్లి: మధురానగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారాక్ దేవేందర్ , మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, బేజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ సందయ్య మెమోరియల్ ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా పేదలకు వైద్యం, విద్య అందించేందుకు చేస్తున్న మరవలేనిదని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమలను నిర్విఘ్నంగా నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. సేవ అనేది అందరూ చేయాలని మన పక్కన ఉండే వాళ్లు కష్టాలలో ఉన్నపుడు మనకు ఉన్నంతలో సహాయం చేయడం మనల్ని చూసి మరి కొంతమంది సహాయం చేస్తారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ విద్య అంటే చాల ఇష్టమని, మంచిగా చదివే విద్యార్థులు మరింత ఇష్టమని అన్నారు. అలాగే వైద్యం అందక ఎంతో మంది ఇబ్బందులు పడటం చనిపోవడం కళ్లారా చూశానని, అందుకే ప్రతి పేదవాడు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందన్నారు. గత 20 సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ 2002లో ప్రారంభించబడిన ఈ ట్రస్టు ద్వారా ఎంతో మంది పిల్లలకు పుస్తకాలు, బట్టలు, మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తున్నామని చెప్పారు. పేదలకు వైద్యం అందించడానికి జనరల్ హాస్పిటల్ ను, ఐ హాస్పిటల్ ని , ప్రజల దగ్గరికి వైద్యం అందేలా మొబైల్ హాస్పిటల్ ద్వారా ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు. రోజుకు సుమారుగా 200 మందికి ఈ ట్రస్టు ద్వారా వైద్యం అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ఆవుల సత్యనారాయణ, లక్ష్మణ్ గౌడ్, రాఘవేంద్ర రావు, నాగుల గౌడ్, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, సీతారామరాజు, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీధర్, ఆంజనేయులు సాగర్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, హనుమంతు నాయక్, మధు యాదవ్, వెంకటేష్, గణేష్, పద్మ వరలక్ష్మి, మహేశ్వరి అరుణ రేణుక, మాలిక, శీను , రాము, శివ తదితరులు పాల్గొన్నారు.