నమస్తే శేరిలింగంపల్లి: కేసీఆర్ ముఖ్యమంత్రిగా పేదలకు చేసింది శూన్యమని, తన కుటుంబ సభ్యులకు కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టే పనిలో నిమగ్నమయ్యారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ నిర్వాసితులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది పేదల కోసం కాదని తన కొడుకుకు ఆస్తులు కట్టబెట్టేందుకేనని, పేదలను రోడ్డు పాలు చేస్తూ కేటీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర లేపుతున్నారని రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేళ్ళు అయినా పేదలకు ఏమి చేయకపోవడం బాధాకరమని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేదల ఇల్లు కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారన్నారు. బసవతారక నగర్ నిర్వాసితులకు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్లు కట్టుకోవడానికి రుణాలు ఇస్తుందని, కనీసం వాటిని ఉపయోగించుకునే అవకాశం లేకుండా చేస్తూ టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందని అన్నారు. ఏది ఏమైనా నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పార్టీ మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటుందని అన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కే టీ ఆర్ స్పందించకుంటే సోమవారం పెద్దఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం అంతా బసవతారక నగర్ పేదలకు తోడుగా ఉండి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని అన్నారు.