నమస్తే శేరిలింగంపల్లి: ఇజ్జత్‌నగర్ శ్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వ వేలం నుంచి కాపాడాలంటూ మాదాపూర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధకృష్ణ యాదవ్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు శనివారం వినతీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో ఉన్న శ్మశానవాటికను స్వర్గధామంగా మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం వాటిని అమ్ముకునేందుకు తెరలేపడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైకరి పట్ల ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోయిందని, శ్మశాన వాటికల జోలికి రావడంతో వారికి మరింత మూడినట్టే అని అన్నారు. ఇజ్జత్ నగర్ శ్మశాన వాటికను కాపాడే విషయంలో బిజెపి రాష్ట్ర శాఖ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఈ తెలంగాణ ప్రభుత్వం పేదల బొందల గడ్డను గద్దలా ఎగరేసుకుపోవాలని చూస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే బీసీ, ఎస్‌టీ, ఎస్‌సీల తరుపున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బిజెపి నాయకులు నర్సింహా యాదవ్, డివిజన్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మదనాచారి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బాలాకుమార్ తదితరులు పాల్గొన్నారు.