నమస్తే శేరిలింగంపల్లి: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 20న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ చేపట్టనున్నట్లు ఏఐఎఫ్ డీ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, హైదరాబాద్ కన్వీనర్ పవన్ తెలిపారు. బంద్ కు సంబంధించిన వాల్ ఫోస్టర్ ను జేన్టీయూ సర్కిల్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న పాఠశాల, జూనియర్ కళాశాల విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేళ్లు గడిచినా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పేదలకు విద్య దూరం చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా మారి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషిస్తుందని వాపోయారు. విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫాం అందలేదన్నారు. మన ఊరు మన బడి ప్రణాళిక పేరుతో కొన్ని పాఠశాలలకు మాత్రమే నిధులు కేటాయించి మిగతా పాఠశాలలో కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి రెండో సారి గద్దెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ నెల 20వ తేదీన వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యా సంస్థల బంద్ కు విద్యార్థులు, యాజమాన్యం, అధ్యాపకులు, మేధావులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర లా స్టూడెంట్స్ కన్వీనర్ మిద్దెల రాజశేఖర్, చంద్ర శేఖర్, అక్షయ ముదిరాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.