విద్యావంతులే సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోతున్నారు: సైబర్ క్రైమ్స్ ఎసిపి బాలకృష్ణా రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:విద్యావంతులే సైబర్ నేరస్థుల చేతిలో మోసపోతున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ ఎసిపి కె. బాలకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. మదీనగూడ మై హోమ్ జెవెల్ క్లబ్ హౌస్ లోని న్యూ ఫంక్షన్ హాల్ లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ చాలామంది సైబర్ నేరస్తులు రూపొందిస్తున్న నకిలీ కస్టమర్ కేర్ సెంటర్లు, వెబ్ సైట్లు, ఇతర ఆన్ లైన్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. కేవైసీ అప్డేట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లోన్లు, బహుమతులు, ఆఫర్లు, లాటరీలు, డిపాజిట్లు వంటి ప్రలోభాలకు లోనుకావద్దని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే అకౌంట్ నెంబర్లు, క్రెడిట్ కార్డు నెంబర్లు, డెబిట్ కార్డు నెంబర్లు, ఆధార్ కార్డు నెంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని సూచించారు. సైబర్ నేరస్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఉండడం వల్ల పట్టుకోవడం కష్టతరంగా తయారయిందన్నారు. అనేకసార్లు నేరస్తులు పోలీసులపై దాడులు కూడా చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలను తగ్గించాలని ఏసీపీ బాలకృష్ణా రెడ్డి కోరారు. మియాపూర్ ఎసిపి ఎస్.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దురాశ, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల సైబర్ నేరస్థులకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే అత్యాశ, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే దురాశవల్లనే సైబర్ నేరస్తులకు దొరుకుతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరస్తులు అందమైన అమ్మాయిలను ఎరగా వేయడంతో ఆకర్షితులై తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారని ఏసీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. మియాపూర్ ఇన్స్ పెక్టర్ శామల వెంకటేశ్ మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువమంది సైబర్ నేరస్తులు చేతిలో మోసపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కస్టమర్ కేర్ నెంబర్ లు గూగుల్ వెతకవద్దని, అధికారిక వెబ్ సైట్ లోనే తీసుకోవాలని సూచించారు. ఇటీవలి కాలంలో కస్టమర్ కేర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ అవగాహన సదస్సులో మియాపూర్ ఎస్ఐ రవికుమార్, మై హోమ్ జెవెల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.మురళీధర్ రావు, ప్రధాన కార్యదర్శి నంద కిషోర్, కార్యవర్గ సభ్యులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు, రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులను సత్కరించారు.

సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సైబర్ క్రైం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here