శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ, వారికి సంఘీభావం ప్రకటిస్తూ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బంధారపు నరసయ్య గౌడ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి కార్యాలయం నుంచి ప్రారంభమైన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థుల గొంతును అణిచివేసే చర్యలు సమంజసం కాదన్నారు. విద్యార్థులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేసి, వారి హక్కులు, భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదని పేర్కొన్న నాయకులు వారి స్వేచ్ఛ, భద్రత, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను అణచివేతతో కాకుండా చర్చలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు భేరి రామ్‌చందర్, విజయలక్ష్మి, వాసుకి, పొనుగోటి సందీప్, యాప్రాల్ రాజు, పద్మ, శ్రీకాంత్, శాగంటి శ్రీనివాస్, సంగమ్మ, మంగమ్మ, యాది, తిరుమల్తోపాటు ప్రశాంత్ నగర్, బసవతారక నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.





