- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
- 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
- పనిచేయనున్న 8,152 మంది సిబ్బంది
- ఒక్క రౌండ్‌కు 14వేల ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం జరగనున్న ఓట్ల కౌంటింగ్‌కు గాను అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగ్గా, ఓల్డ్ మలక్‌పేటలో అభ్యర్థుల గుర్తులను తప్పుగా ముద్రించినందుకు గాను గురువారం అక్కడ రీపోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
శుక్రవారం ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 వరకు హాల్స్ ను ఏర్పాటు చేశారు. 1 హాల్‌కి మొత్తం 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 8,152 సిబ్బంది పనిచేయనున్నారు. 31 మంది కౌంటింగ్ పరిశీలకులు విధి నిర్వహణలో ఉంటారు.
కాగా కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసేందుకు ఇప్పటికే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రౌండ్‌కు 14వేల ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు. బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారు. ఇక కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుతించడం లేదు.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైంది. 74,67,256 ఓటర్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18, 60, 040 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15, 90, 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 72 మంది ఇతరులు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి.