నమస్తే శేరిలింగంపల్లి: కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రంగారెడ్డి జిల్లా నాయకులు తిప్పర్తి మహేష్, సి. శోభన్ అన్నారు. చందానగర్ పిజేఆర్ స్టేడియం వద్ద అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి కార్గిల్ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహేష్, శోభన్ మాట్లాడుతూ పాకిస్తాన్ యుద్దోన్మాద చర్యల వల్ల వందలాది మంది భారత సైనికులు అమరులయ్యారని అన్నారు. సైనికుల త్యాగ ఫలితంగా మన దేశం శత్రు దేశాలపై విజయం సాధించిందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం కుట్రలో భాగంగానే పాకిస్తాన్ ఇలాంటి నీచమైన దాడులకు పాల్పడిందని విమర్శించారు. సైనిక ఆర్థిక రాజకీయ సామాజిక శక్తిలో మన దేశానికి పాకిస్తాన్ ఏమాత్రం సరిపోదని అన్నారు. మతోన్మాదం తీవ్రవాదాన్ని నమ్ముకున్న ఏ దేశం బాగు పడదని చరిత్ర చెబుతోందన్నారు. సామ్రాజ్యవాదం యుద్ధం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీఎస్ఓ నాయకులు కె. క్రిష్ణ, కిష్టప్ప, నాగేశప్ప, కే. ప్రభాకర్, బి. అశోక్, నర్సింహులు, మురళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.