నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా కాలయాపన చేస్తోందని ఏఐఎఫ్ డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ ఎద్దేవా చేశారు. ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశాన్ని మియాపూర్ ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో దేపూరి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. వనం సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 36వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని, ఎన్నికలకు ముందు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నేటికి భర్తీ చేయకపోవడం దారుణమని అన్నారు. ప్రస్తుతం జోనల్ వ్యవస్థ పేరుతో, ఉద్యోగాల సర్దుబాటు పేరుతో నలుగురు ఐఏఎస్ అధికారులతో ఉద్యోగాల భర్తీకి సబ్ కమిటీ వేయడం కాలయాపన కోసమేనని అన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో నిపుణుల అంచనా ప్రకారం ఒక లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని అన్నారు. వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎఫ్ డీ వై ఆధ్వర్యంలో నిరుద్యోగ, యువజన సమస్యలు పరిష్కరించాలని అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలను అందించనున్నట్లు తెలిపారు. ఏఐఎఫ్ డీవై గ్రేటర్ హైదరాబాద్ నాయకులు డి.మధుసూదన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లో ఏఐఎఫ్ డీవై సభ్యత్వాలు కొనసాగుతున్నాయని, 23న గ్రేటర్ హైదరాబాద్ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ, యువజన సమస్యలతో పాటు స్థానిక సమస్యల పై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వి.తుకారాం నాయక్, దేపూరి శ్రీనివాసులు, బి.రవి, డి.కీర్తి, ఎం.డి.సుల్తానా, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.