నమస్తే శేరిలింగంపల్లి: చిన్నారి చైత్ర ను అత్యాచారం చేసి హత్య చేసిన రాజు అనే నిందితుని పై నిర్భయ కేసు నమోదు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏ ఐ ఎఫ్ డి ఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బాగ్ లింగంపల్లి ఓంకార్ భవన్ లోని ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున మాట్లాడుతూ సెప్టెంబర్ 11వ తేదీన సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారి చైత్ర ను అదే కాలనీకి చెందిన రాజు అనే 30 సంవత్సరాల యువకుడు తన రూములోకి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా చైత్ర కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య సునీల్ నాయక్, ఆఫీస్ బేరర్స్ తదితరులు పాల్గొన్నారు.