మియాపూర్, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణపై చర్యలు చేపట్టాలని కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య నిర్వహణ సమస్యలు, దోమల నివారణపై జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య నిర్వహణ అధికారులు, ఎంటమాలజీ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య నిర్వాహణ లోపాలను గుర్తించి ప్రతి కాలనీలో ప్రతి రోజూ అంతర్గత రహదారులను శుభ్రం చేయడంతోపాటు చెత్త, ఇతర వ్యర్థాలు పేరుకు పోకుండా వెంటనే తొలగించాలని పారిశుద్ధ్య నిర్వహణ అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు సంబంధించి చేపట్టవలసిన ఫాగింగ్, మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలని, ప్రజలలో పరిసరాల పరిశుభ్రతపై తగు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి పారిశుద్ద్య నిర్వహణ అధికారులు, ఎస్ఆర్పిలు, కనకరాజు మహేష్, ఎంటమాలజీ ఏఈ గణేష్, రాజేష్, బాలగౌడ్, ఎస్ఎఫ్ఏలు, వినయ్, మహేష్, నాగరాజు, అగమ్య, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.