శేరిలింగంపల్లి, ఆగస్టు 31 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అయ్యప్ప సొసైటీలో సుమారు 70 నుంచి 80 వరకు అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వాటికి సంబంధించిన ప్లాట్ నంబర్లు, ఫొటోలతో సహా సోమవారం ప్రజావాణిలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అనుమతులు లేని 50 నుంచి 60 గజాల ఇళ్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు, అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణాలు అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. సుమారు 4వేలు, 2వేలు, 500 గజాల స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్‌తో పాటు పది అంతస్తుల వరకు భారీ భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. సిఎంసి కార్యాలయానికి సమీపంలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంజయ్య నగర్‌లో మాత్రమే అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించిన మల్లారెడ్డి.. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించడం కంటే, ప్రమాదం జరగకముందే పరిస్థితులను గుర్తించి నివారించడమే సమర్థవంతమైన అధికారుల లక్షణమని అన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్, సిఎంసి కమిషనర్ సృజన ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. మాదాపూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణకు అక్రమ నిర్మాణాలపై పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదుదారులను మానసికంగా అవమానించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వారం రోజుల్లోగా అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి, ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల వద్ద నిర్మాణదారులను భయపెట్టి కొందరు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని మల్లారెడ్డి తెలిపారు. ఈ వసూళ్ల వ్యవహారంపైనా అధికారులు విచారణ జరిపి, వెంటనే అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు.





