శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BIACH & RI)లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత గౌరవప్రదంగా, భావోద్వేగపూరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరపేటిక క్యాన్సర్ కారణంగా లారింజెక్టమీ శస్త్రచికిత్స పొందిన క్యాన్సర్ విజేతలు కలిసి జాతీయ గీతం జన గణ మనను ఆలపించి ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు. బంజారా హిల్స్‌లోని ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమంలో, లారింజెక్టమీ సర్వైవర్స్ ఎలక్ట్రోలారింక్స్ పరికరాలు, ట్రాకియో–ఈసోఫేజియల్ వాయిస్ ప్రోస్తెసిస్ (TEP) సహాయంతో సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ అరుదైన, వినూత్న ప్రయత్నాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా ధృవీకరించి, లారింజెక్టమీ సర్వైవర్స్ ద్వారా నిర్వహించిన తొలి సామూహిక జాతీయ గీతాలాపనగా ప్రపంచ రికార్డుగా గుర్తించింది. కార్యక్రమం జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమై, అనంతరం లారింజెక్టమీ సర్వైవర్స్ గీతాలాపన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ (NBTRMCF) చైర్మన్ , ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బోర్డు సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, జె. ఎస్. ఆర్. ప్రసాద్, సీఈఓ డాక్టర్ కృష్ణయ్య,
మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర రావు, చీఫ్ – హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ డాక్టర్ ఎల్. ఎం. చంద్రశేఖర రావు, సీనియర్ ఆంకాలజిస్టులు, వైద్య సిబ్బంది, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.






