శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల విద్యాధికారి కార్యాలయం వద్ద ఉన్న భవిత కేంద్రంలో వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీలకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకటయ్య హాజరై విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, బిస్కెట్లు, పాప్ కార్న్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టిన మహోన్నతుడు అని కొనియాడారు. ఆయన భారత రాజ్యాంగ రచనలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమిక హక్కుల కమిటీకి ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. ఆయనని మహాత్మాగాంధీ సర్దార్ అనే బిరుదుతో సత్కరించారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా పాటిస్తున్నారని అన్నారు. అలాగే పేదల పెన్నిధి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా, అలీన దేశాల అధ్యక్షురాలిగా ఈ దేశానికి, అలీన దేశాలకు విశేషమైన సేవలు అందించారని కొనియాడారు. ఆవిడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజ భరణాల రద్దుతోపాటు బ్యాంకులను జాతీయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, ప్రేమ్ సింగ్, కృష్ణ, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు.






