శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక రోజు – ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా మంగళవారం గాజులరామారం సర్కిల్-57 పరిధిలోని మహాదేవపురం వార్డు-277లో ఉన్న కైలాష్ హిల్స్ పార్కు వద్ద రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏలు) ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాష్ హిల్స్, మహాదేవపురం కాలనీ, షిర్డీ హిల్స్, బాలయ్య నగర్, యండమూరి లేఅవుట్, పీఎన్ఆర్ ఒయాసిస్, ప్రాగా టూల్స్ కాలనీ, రావి నారాయణ రెడ్డి నగర్, కైసర్ నగర్ 2BHK, గాలి పోచమ్మ బస్తీ ప్రాంతాల నివాసితులు తమ సమస్యలు, అభివృద్ధి అవసరాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి మొత్తం 10 వినతిపత్రాలు అందాయి. ముఖ్యంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, వీధి దీపాల మరమ్మత్తులు, కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, వర్షపు నీటి కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు. ఈ పనులకు సంబంధించిన అంచనాలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పరికి చెరువు ప్రవేశ ద్వారం వరకు భూమి సేకరణ చేపట్టి స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (ఎస్‌డబ్ల్యూడీ) అభివృద్ధి చేయాలని కైలాష్ హిల్స్ ఆర్డబ్ల్యూఏ ప్రతినిధులు కోరారు. అలాగే భవన నిర్మాణ అనుమతుల జారీ, పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ అంశాలను పరిష్కరించాలని మహాదేవపురం సంక్షేమ సంఘం వినతిపత్రం సమర్పించింది. 100 అడుగుల రోడ్డు, బాలయ్య నగర్‌కు వెళ్లే రహదారిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని మరో వినతిపత్రం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
కైలాష్ హిల్స్, పీఎన్ఆర్ ఒయాసిస్, ప్రాగా టూల్స్ కాలనీ ప్రతినిధులు ప్రస్తుతం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను తమ కాలనీల అంతర్గత రహదారుల శుభ్రత కోసం తిరిగి నియమించాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో షిర్డీ హిల్స్, మహాదేవపురం, బాలయ్య నగర్ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయడంతోపాటు ఫాగింగ్ నిర్వహించాలని స్థానికులు ఎంటమాలజీ విభాగాన్ని కోరారు. అల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో ఉన్న పరికి చెరువులో భారీగా పేరుకుపోయిన నీటి గుర్రపు డెక్క (వాటర్ హయాసింథ్)ను తొలగించాలని షిర్డీ హిల్స్, కైలాష్ హిల్స్, మహాదేవపురం కాలనీల ప్రతినిధులు కోరారు. అలాగే చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే చర్యలు చేపట్టాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.





