చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వెనుకబడిన బీసీ వర్గాలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలని శిష్ఠ కరణ సమాజ జాతీయ ఓబీసీ సాధన కమిటీ కన్వీనర్ డీవీ కృష్ణా రావు డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శిష్టకరణ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ చందానగర్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శిష్టకరణ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శిష్టకరణ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల సౌకర్యంలో భాగంగా బీసీలకు అందిస్తున్న రిజర్వేషన్ శాతాన్నిపెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన తరగతుల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజికంగా వెనుకబడిన శిష్టకరణ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ సంక్షేమ సంఘం నాయకులు ఉరిటి, పార్వతీశ్వరరావు, మోటూరి నారాయణరావు, పార్థసారథి, తిరుపతి రావు, కొట్టక్కి వెంకటేశ్వర రావు, జయశ్రీ, బిటి రమేష్, ప్రకాష్ రావు, ప్రతాప్ రాజ్, శంకర్ పట్నాయక్, ఢిల్లీ శంకర్ పాల్గొన్నారు.
