నమస్తే శేరిలింగంపల్లి: వన్డే లీగ్ మ్యాచ్ లో ప్రముఖ బౌలర్ ఇశాన్ రెడ్డి తన సత్తా చాటాడు. ది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని ఫయాజ్ క్రికెట్ అకాడమీలో ఇటీవల అక్షిత సిసి, యూనివర్సల్ సిసి జట్ల మధ్య ఉత్సాహవంతమైన పోరు కొనసాగింది. యూనివర్సల్ సిసి జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి 29 ఓవర్లలో 148 చేసి ఆలౌట్ అయ్యింది. కాగా బ్యాట్స్ మెన్ లను కట్టడి చేయడంలో ప్రత్యర్థి జట్టు బౌలర్ ఈశాన్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. 9.1 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన అక్షిత సిసి జట్టు 29.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు సాధించి విజయం కైవసం చేసుకుంది. బ్యాట్స్ మెన్ అనిరుధ్ అత్యధికంగా 31 పరుగులు సాధించాడు. కాగా అద్భుత ప్రతిభ కనబరిచి జట్టు విజయానికి కారణమైన బౌలర్ ఇషాన్ రెడ్డిని, తండ్రి శ్రీనివాస్ రెడ్డి, కోచ్ లను క్రీడా ప్రముఖులు అభినందించారు.
