నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న భారత్‌బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్రకార్యదర్శి తాండ్రకుమార్ పేర్కొన్నారు. శనివారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాన్ని నాయకులు వనం సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తాండ్రకుమార్ మాట్లాడుతూ గత 114 రోజులుగా కేంద్రం ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 26న జరిగే భారత్‌బంద్ కార్యక్రమంలో ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను జనాభా ప్రాతిపదికన ప్రవేశపెట్టాలని, ఈ సంవత్సరపు బడ్జెట్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేసిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దికాయల అశోక్, గాదగోని రవి, వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వరికుప్పల వెంకన్న, సింగతి సాంబయ్య, కుంభం సుకన్య, వసుల మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.






