నమస్తే శేరిలింగంపల్లి: ఉప్పల్ భగాయత్ లోని నూతన భవనం వద్ద గౌడ హాస్టల్ సర్వసభ్య సమావేశం ఆదివారం వాడి వేడిగా కొనసాగింది. గౌడ హాస్టల్ నూతన భవన ప్రారంభోత్సవం, మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల విషయంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ క్రమంలో సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ లోపు సదరు రెండు అంశాలపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ హామీ ఇచ్చింది.

రూ.5 కోట్ల విలువైన భూమి విరాళం…
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన గౌడ ప్రముఖులు, గౌడ హాస్టల్ కోఆప్షన్ సభ్యులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ గౌడ హాస్టల్ కు సంబంధించి మరో నూతన భవన నిర్మాణం కోసం నందిగామ గ్రామంలో సుమారు రూ.5 కోట్ల విలువైన అర ఎకరం భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గౌడ హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ, గౌరవ సభ్యులు లక్ష్మీనారాయణ గౌడ్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. వారి దాతృత్వాన్ని విశేషంగా కొనియాడారు. గౌడ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో విలువైన భూమిని గౌడ జాతికి దారాదత్తం చేయడం ఆదర్శనీయం, అభినందనీయమన్నారు.
