నమస్తే శేరిలింగంపల్లి: వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ బస్టాండ్ వద్ద హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ కేంద్రంను కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పాదచారుల, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. చలివేంద్రాలు ప్రజల దాహాన్ని తీర్చడానికి ఎంతో దోహద పడుతాయని చెప్పారు. అన్ని దానాల కన్నా నీటి దానం చాలా గొప్పదన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసిన నిర్వాహకులు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ ని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కోనేరు ప్రసాద్, అనిల్ కావూరి, మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.