నమస్తే శేరిలింగంపల్లిః దేశవ్యాప్తంగా ఈ నెల 28 29 తేదీల్లో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకులు కృష్ణ ముదిరాజ్, రామకృష్ణ కోరారు. మాదాపూర్ బుల్లెట్ ఆటో స్టాండ్ లో అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కార్మిక చట్టాలను కాల రాయడమే కాకుండా అసంఘటిత రంగాలకు చెందిన ఆటో, ట్రాలీ ఆటో, లారీ ఇతర ప్రైవేటు రంగంలో ఎంతగానో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలందిస్తున్న రవాణా వ్యవస్థ పై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఆటోలను లారీ ఇతర చిన్న పరిశ్రమల పై దాడులను తీవ్రతరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అడ్డగోలు చలాన్లను వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ రేట్లను విపరీతంగా పెంచడంతో ప్రైవేట్ రంగంలో జీవనం కొనసాగిస్తున్న ఆటో, క్యాబ్, లారీ తదితర రవాణా వ్యవస్థ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. వీటన్నింటిపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.