నమస్తే శేరిలింగంపల్లి: పేద ప్రజలలో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి 58, 59 జీఓల కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కలిపించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్ లో జీఓ నం.58, 59 లపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ వంశీ మోహన్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్,ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఇండ్ల స్థలాల క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మార్చి 31 వ తేదీ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనాధికారిక నివాస స్థలంలో నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నట్లు ఆధారాలు చూపాలని, వ్యక్తిగత ధ్రువీకరణ కు ఆధార్ తో పాటు ఇతర ధృవీకరణలు సమర్పించాలన్నారు. ఆక్రమిత స్థలంలో నివాసం ఉన్నట్లు దృవీకరించేందుకు రిజిష్ట్రర్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రశీదు, విద్యుత్, నల్లా బిల్లు, తదితర ఆధారాలు సమర్పించాలని సూచించారు. ,దారిద్ర్య రేఖ కు దిగువ ఉన్న పేదలకు125 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తారని, ఆపై నిర్మాణాలు ఉన్న అనాధికారిక నివాస రిజిస్ట్రేషన్ ధరల్లో 50 నుంచి వంద శాతం వరకు వసూలు చేస్తారని, 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరల్లో 50 శాతం, 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరల్లో 75 శాతం, 500 గజాల పై ఉన్న రిజిస్ట్రేషన్ ధరల్లో 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాణిజ్య అవసరాల కోసం వాడుకునే స్థలం పరిమాణంతో నిమిత్తం లేకుండా రిజిస్ట్రేషన్ ధర చెల్లించాలని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు.

2014 సంవత్సరం నాటికి రిజిస్ట్రేషన్ ల్యాండ్ మార్కెట్ విలువ ప్రకారం నోటిఫైడ్ స్లమ్స్ 10 శాతం వరకు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి మంచి అవకాశం అన్నారు. సర్వే నంబర్ 77 నుండి 88 వరకు హఫీజ్ పెట్ లో నివసిస్తున్న ప్రజలు దరఖాస్తు చేసుకోగలరని, సర్వే నంబర్ 366, 367 చందానగర్ విలేజ్ హుడా కాలనీ ఈడబ్ల్యుఎస్ లో కేటాయించిన గృహ యజమానులు అదనపు స్థలం లో నిర్మించిన కట్టడాల వారు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు.
నవభారత్ నగర్, వడ్డెర బస్తి, ఇజ్జత్ నగర్, హరిజన బస్తీ, బిక్షపతి నగర్ లలో నిర్మించుకున్న నివాసాల వారు దరఖాస్తు చేసుకోవచ్చని, సర్వే నంబర్ 60, 71 నుండి 77 వరకు కొండాపూర్ గ్రామం రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీ, గోల్డెన్ తులిప్ లోని వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ నల్లగండ్ల విలేజ్ సర్వే నంబర్ 195, ఎన్టీఆర్ నగర్, సోఫా కాలనీ , తాజ్ నగర్, గోపన్ పల్లి విలేజ్ సర్వే నంబర్ 124 , గోపన్ పల్లి తండా సర్వే నెంబర్ 33,34, డైమండ్ హైట్స్ 20 ఎకరాల హుడా అప్రూవ్డ్ లే ఔట్ ఖాజాగూడ సర్వే నెంబర్ 27, 28 నివాసం ఉంటున్న వారు గృహాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. సురభి కాలనీ సర్వే నెంబర్ 322 నుంచి 328 లో దరఖాస్తు చేసుకోవచ్చని, మసీదు బండ గ్రామము, వడ్డెర బస్తి సర్వే నంబర్ 104, గ్రామ కంఠ స్థలాలలో ఇండ్లు నిర్మించుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీటితో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మిగతా చోట్ల అనధికారిక నివాస స్థలంలో ఉన్న వారు 58, 59 జీఓల నియమ నిబంధనలకు వర్తించిన వారు, అర్హులైన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.