నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్ లో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, మీటర్ల బిగింపు సమస్యలపై మాట్లాడారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఇళ్లు కట్టుకుని పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారి ఇళ్లకు విద్యుత్ మీటర్లు ఇవ్వకుండా ఒకట్రెండు మీటర్ల తో విద్యుత్ ను సరఫరా చేస్తున్నారని అన్నారు. దీంతో ఒత్తిడి పెరిగి మీటర్ కాలిపోయి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మన నగరం కార్యక్రమంలో నష్టపరిహారం బాండ్ తీసుకొని విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ లు ఇవ్వమని మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. ఒక సంవత్సరం వరకు ఇచ్చి రెండేళ్లుగా విద్యుత్ మీటర్లు ఆపేశారన్నారు. ఇప్పటికే 300 ట్రాన్స్ ఫార్మర్స్ అవసరం ఉందని, ఒకే విద్యుత్ మీటర్ మీద కనెక్షన్ ఇవ్వడం వలన ఒకే మీటర్ కాలిపోవడం సమయం గ్యాప్ తో రెండు మూడు రోజులు కరెంట్ లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు.మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వత పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కరెంట్ మీటర్ల అంశాన్ని నోట్ చేసుకున్నాం అని, తప్పకుండా త్వరలోనే పరిశీలించి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.
