నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో కొత్తగా మోడల్ మార్కెట్ నిర్మాణంపై ఉన్న అపోహలను తొలగించాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్ జాయింట్ కమిషనర్ మల్లారెడ్డిని బిజెపి నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ మోడల్ మార్కెట్ నిర్మాణంపై స్థానిక ప్రజలకు ఎన్నో అపోహలు తలెత్తుతున్నాయని అన్నారు. సుమారు రూ. 20 కోట్లతో మోడల్ మార్కెట్ నిర్మిస్తామని తెలిపిన ఎమ్మెల్యే ఈ విషయంపై అధికారులకు మాత్రం ఎలాంటి సమాచారం లేదన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు కొరవడిన సమన్వయ లోపంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకట్, బిజెపి చందానగర్ డివిజన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి, సీనియర్ నాయకులు శాంతి భూషణ్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.