నమస్తే శేరిలింగంపల్లి: అసంఘటితరంగ కార్మికులకు ఈ శ్రమ్ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినీల అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ లో పల్లపు యాదయ్య ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వినీల మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు, తోపుడుబండ్ల కార్మికులు, ఇళ్లల్లో పనిచేసే కార్మికులు, ఆయా రంగాలలో పనిచేసే కార్మికులందరూ ఈ శ్రమ్ గుర్తింపు కార్డులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్డును 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని అన్నారు. దీంతో ప్రతి కార్మికుడికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యం కలిగితే లక్ష రూపాయలు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట లక్ష్మీ నరసింహ స్వామి, నర్సయ్య, సుధాకర్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.