నమస్తే శేరిలింగంపల్లి: భారత కోకిల, మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప రచయిత్రి, ఉపన్యాసకురాలు సరోజినీ నాయుడు అని హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి అన్నారు. సరోజినీ నాయడు జయంతి వేడుకలను కొత్తగూడలోని శారద హై స్కూల్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. యూనివర్సిటీ ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి పాల్గొని మహిళా సాధికారిత, సరోజినీ నాయుడు పాత్ర అనే విషయం మీద ప్రసగించారు. మతాల కన్నా మానవత్వమే ముఖ్యమని నమ్మిన మణిపూస సరోజినీ నాయుడు అని అన్నారు. హిందూ, ముస్లింల ఐక్యతతో ముందుకు సాగాలని నినదించిన వ్యక్తి అని తెలిపారు. సరోజినీ నాయుడు 12 సంవత్సరాలకే మద్రాస్ యూనివర్సిటీ నుండి మెట్రిక్యూలేషన్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై రికార్డు నెలకొల్పారు. సరోజినీ నాయుడు చిన్నతనం నుండే ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ, పర్శియాన్ తదితర భాషలలో అనర్గళంగా మాట్లాడే ప్రతిభావంతురాలన్నారు. 13వ యేటా రచయితగా మారిన సరోజినీ నాయుడు రాసిన లేడీ అఫ్ ది లెక్ రచన చదివిన నిజాం నవాబు ఆమెను ప్రోత్సహించి, ఉపకార వేతనం ఇచ్చి, ఉన్నత చదువులకై ఇంగ్లాండ్ పంపించారని తెలిపారు. కేం బ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు తన రచనలతో బ్రిటిష్ విమర్శకులను సైతం మెప్పించారన్నారు. పద్యాలను రాగయుక్తంగా, శ్రావ్యంగా వినసొంపుగా పాడటంతో ఆమెను భారత కోకిలగా పిలిచేవారన్నారు. దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్ధం చేసుకొని, అక్కడ నివసిస్తున్న భారతీయ సంతతి హక్కుల కోసం పోరాటం చేసిన యోధురాలని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని మహిళల కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింప చేసిన వారిలో సరోజినీ నాయుడు ప్రముఖురాలని అన్నారు. మహిళా సాధికారాతకై చేసిన కృషికి గుర్తింపుగా సరోజిని నాయుడు జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిచుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేందర్ బాబు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, జనార్దన్, సుబ్రహ్మణ్యం, కుర్ర అజిత, భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.