నమస్తే శేరిలింగంపల్లి: కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా ఆస్పత్రిని నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. నిజాంపేట్ రోడ్ లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదం కేవలం యాజమాన్యం అజాగ్రత్త వల్ల మాత్రమే జరిగిందని, ఈ హాస్పిటల్ లో కనీస అగ్నిప్రమాద సహాయక పరికరాలు లేవని, హాస్పిటల్ రాకపోకలకు ఒకే దారి ఉండడం, ఫైర్ ఎగ్జిట్ కూడా లేకపోవడం దారుణమన్నారు.
కోవిడ్ సమయంలో లక్షల ఫీజులు వసూలు చేస్తూ కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడంలో ఉన్న శ్రద్ధ కనీస సదుపాయాలను కల్పించడంలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గడిచిన మూడు నెలల్లో ఇది మూడవ అగ్ని ప్రమాదమని, గతంలో జరిగిన ప్రమాదాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కనీస భద్రత వసతులు లేకుండా ఏ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నారని, అడ్డగోలుగా లంచాలు తీసుకుని అధికారులు అనుమతులు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే దీని మీద విచారణ జరిపి ఆస్పత్రి అనుమతులను రద్దు చేయాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులతో, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.