నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను భంగపరుస్తూ ప్రతిపక్ష ప్రజా గొంతుకలను అరెస్టులతో నొక్కివేయాలని ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టు ను నిరసిస్తూ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న బిజెపి నాయకులను కరోనా నిబంధనల పేరుతో మంగళవారం పోలీసులు అరెస్టు చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో నైజాంల వ్యవరుస్తున్నారని దుయ్యబట్టారు. శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగరణ దీక్ష చేపడితే అడ్డుకొని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఉద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్న పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై దాడి చేయడం, కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అణచివేత దోరణి ఏ మేరకు ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని త్వరలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. భేషరతుగా బండి సంజయ్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నాగుల్ గౌడ్, నాయకులు లక్ష్మణ్, చందు, ఆంజనేయులు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.