నమస్తే శేరిలింగంపల్లి: మహిళా స్ఫూర్తి ప్రదాత సావిత్రి బాయి పూలే అని ఏఐఎఫ్ డీ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కళావతి అన్నారు. హైదరాబాద్ లోని ముజాఫర్ అహ్మద్ నగర్ లోని తాండ్ర రామచంద్రయ్య జిల్లా కార్యాలయంలో సావిత్రి బాయి పూలే 191 వ జయంతిని ఏఐఎఫ్ డీ డబ్ల్యు, ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏఐఎఫ్ డీ డబ్ల్యు జిల్లా కార్యదర్శి అంగడి పుష్ప, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ తుకారాం నాయక్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే మహిళా స్ఫూర్తి ప్రదాత అని, ధీరత్వం, మానవత్వం, గొప్ప మహిళా సంఘ సంస్కర్త, ప్రజా సేవకురాలని అన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలని, రైతు కుటుంబంలో జన్మించిన సావిత్రి బాయి పూలే తెలంగాణ ప్రాంతంతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. సావిత్రి బాయి పూలేను దేశ వ్యాప్తంగా మహిళలు ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ రాష్ట్ర, జిల్లా నాయకులు మైదాన్ శెట్టి రమేష్, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, డి. మధుసూదన్, నర్సింగ్, లావణ్య, లక్ష్మీ, ఈశ్వరమ్మ, చైతన్య, సుల్తానాబేగం, శివాని, శ్రీలత, తుడుం పుష్పలత, నందిని తదితరులు పాల్గొన్నారు.