నమస్తే శేరిలింగంపల్లి: భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం, తనను పట్టించుకోకపోవడంతో పాటు అత్తమామల వేధింపులు తాళలేక ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చార్మినార్ పురాణ హవేళీ కి చెందిన సయ్యద్ ఖలీల్ పెద్ద కూతురు ఖనేజా ఫాతిమా (24)ను ఈ ఏడాది జులై 12న శేరిలింగంపల్లి డోయెన్స్ కాలనీకి చెందిన సయ్యద్ హమీద్ కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. రిసర్చ్ అనాలసిస్ గా పనిచేస్తున్న సయ్యద్ హమీద్ పెళ్లైన కొద్ది రోజులకే సౌదీ అరేబియాకి వెళ్లిపోయాడు. సయ్యద్ హమీద్ అప్పటి నుండి ఫాతిమాతో మాట్లాడడం మానేశాడు. ఎన్ని మెసేజీలు చేసిన రిప్లై ఇవ్వక పోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఫాతిమా అత్తవారింట్లో ఉండలేనని, పుట్టింటికి తీసుకెళ్లాలని గురువారం రాత్రి ఆమె అమ్మానాన్నలకు సమాచారం అందించింది. కానీ ఇంతలోనే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆమె భర్త సయ్యద్ హామీద్ కు ఫోన్ చేసి బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు, అత్తామామల వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని బాధితులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.