నమస్తే శేరిలింగంపల్లి: ఈ- శ్రమ్ పోర్టల్ ద్వారా అసంఘటితరంగ కార్మికులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని శేరిలింగంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినీల, అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం (ఏఐసీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుడుం అనిల్ కుమార్ తెలిపారు. శనివారం మియాపూర్ డివిజన్ ఎంఏ నగర్ లో అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఉచిత క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా కార్మికులందరినీ పేరు నమోదు చేసుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోర్టల్ లో అసంఘటిత రంగ కార్మికులు పేరు నమోదు చేసుకోవడం వల్ల పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన వారికి రూ. 2 లక్షలు, ప్రమాదంలో అంగవైకల్యం కలిగితే లక్షరూపాయలను సంబంధిత కుటుంబానికి ప్రభుత్వంచెల్లిస్తుందన్నారు. ఈ కార్డు కలిగిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తదితర పథకాలు వర్తిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారని వారిని గుర్తించే పనిలో భాగంగా ప్రభుత్వం ఇలాంటి పథకాలు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు, ఉద్యానవనంలో పనిచేసేవారు, ఇంట్లో కుట్టు మిషన్, భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న అన్ని రకాల కార్మికులు, హోటల్ లో పనిచేస్తున్న కార్మికులు ఎలాంటి ఈ ఎస్ ఐ ఈ పి ఎఫ్ లేని, ఇన్ కమ్ టాక్స్ చెల్లించని అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కరూ 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉచితంగా పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అసంఘటిత రంగ కార్మికులు పేరు నమోదు చేసుకున్నారని భవిష్యత్తులో కూడా మిగతా కార్మికులు తమ ఆఫీసుకు వచ్చి నేరుగా పేర్లను నమోదు చేసుకోవచ్చని వారు తెలిపారు. పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ తో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కె రాజు, ఎం రాజు, లావణ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీను, యువజన సంఘం నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు.