- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడి
- స్లాట్ బుకింగ్‌ను ప్రక్రియను ప్రారంభించిన సీఎస్
హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన నూతన రిజిస్ట్రేషన్ల విధానం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రిజిస్ట్రార్లతో సహా అధికారులకు కూడా అధికారాలు ఉండవని అన్నారు. శుక్రవారం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు గాను ఆయన స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 24 స్లాట్లను మాత్రమే బుక్ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ఆన్‌లైన్ లో వెంటనే మ్యుటేషన్ వెంటనే జరిగిపోతుందని, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు.
రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పత్రాలను అందజేస్తారని, అలాగే ఈ-పాస్‌బుక్, ఆరెంజ్ కలర్ పాస్‌బుక్‌లను కూడా వెంటనే ఇస్తారని తెలిపారు. ఎల్‌ఆర్ఎస్ లేనివారి గురించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు తమ ఇళ్లు, ఫ్లాట్లతోపాటు ఓపెన్ ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. ధరణిలోని పెండింగ్ మ్యుటేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో 16 లక్షల లావాదేవీలకుగాను 10వేలు మాత్రమే స్లాట్లను బుక్ చేసుకోవడం ద్వారా జరిగేవన్నారు. కానీ ప్రస్తుతం 100కు వంద శాతం రిజిస్ట్రేషన్లు స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతానికి 96 శాతం సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మిగిలిన సేవలను కూడా ప్రారంభిస్తామన్నారు.
ప్రజల డేటా విషయమై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సోమేశ్ కుమార్ అన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు గాను ఇప్పటికే 100 మంది అధికారులు, నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, వారు బీఆర్‌కే భవన్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలకు కాల్‌సెంటర్ ద్వారా 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4788 కు కాల్ చేసి తెలపవచ్చని అన్నారు.