నమస్తే శేరిలింగంపల్లి:నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐఎఫ్ డీఎస్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మైత్రి రాజశేఖర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఓంకార్ భవన్ బిఎన్ హాల్ లో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఏఐఎఫ్ డిఎస్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఏఐఎఫ్ డిఎస్ జాతీయ కన్వీనర్ డాక్టర్ మైత్రి రాజశేఖర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని కాషాయీకరణ గా మార్చడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వ విద్య సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతూనే ప్రభుత్వ విద్యా సంస్థలను మూసి వేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం విద్యాసంస్థలో కాషాయీకరణ పేరుతో విద్యా సంస్థలలో పూర్తిగా విద్యార్థులను మూఢనమ్మకంలోకి నెట్టే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకువచ్చి పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్ష లాగా చేస్తుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై దుయ్యబట్టారు. తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని జీవో నెంబర్ 46 ని పకడ్బందీగా వెంటనే అమలుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్లాసులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాలోతు జబ్బర్ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భరత్ రాష్ట్ర కోశాధికారి కాశీ, రాష్ట్ర నాయకులు మార్త నాగరాజు, నరేందర్, ఫయాజ్, అరవింద్, నవీన్, శ్యామ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.