నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన లక్ష దీపోత్సవం సోమవారం కన్నులపండుగగా జరిగింది. దీపోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. స్థానిక భక్తులు వీరభద్రరావు, హరిణి దంపతులచే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
భక్తుల శివనామ స్మరణలతో శిల్పా ఎన్ క్లేవ్ ప్రాంతమంతా మార్మోగింది. ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో కొనాసాగిన ఈ ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదివేల దీపాలు వెలిగించారు.