- మెడికల్ షాప్ యజమానులకు గచ్చిబౌలి పోలీసుల అవగాహన
నమస్తే శేరిలింగంపల్లి: మెడికల్ దుకాణాల్లో డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు, నిద్ర మాత్రలను, ఔషదాలను అమ్మకూడదని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు మెడికల్ షాప్స్ యజమానులకు సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ పోలీసులు, డ్రగ్ అథారిటీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మెడికల్ షాప్స్ యజమానులకు గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. మెడికల్ దుకాణాల్లో మత్తు, నిద్ర మాత్రలు, డ్రగ్స్ ను ఇష్టారీతిగా విక్రయించవద్దని చెప్పారు. గుర్తింపు పొందిన డాక్టర్ చిట్టీ ఉంటేనే ఔషదాలు ఇవ్వాలని సూచించారు. ఎక్కువ సార్లు ఒకే రకమైన మత్తు మాత్రల కోసం వచ్చే వారిపట్ల జాగ్రత్తలు వహించి సంబంధిత పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. మెడికల్ దుకాణాల యాజమానులు పోలీసులకు, డ్రగ్స్ కంట్రోల్ వారికి సహకరించి డ్రగ్ ఫ్రీ సమాజం కొరకు పాటుపడాలని సూచించారు. ఈ సమావేశంలో గచ్చిబౌలి, రాయదుర్గం ఎస్ హెచ్ ఓ లు జి. సురేశ్, రాజగోపాల్ రెడ్డి, అంజూమ్ అబీద, జిల్లా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆసిస్టెంట్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తో పాటు గచ్చిబౌలి, మాధాపూర్, నార్సింగి, రాయదుర్గం ప్రాంతాలకు చెందిన 200 మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.